BHAGAVATA KADHA-3    Chapters   

జరాసంధ వధ సమయమునఁ గృష్ణుని కృప

52

శ్లో || యత్తేజపా నృపశిరో7ంఘ్రి మహన్మఖార్థే |

ఆర్యో7నుజస్తవ గజాయుత సత్త్వవీర్యః

తేనాహృతాః ప్రమథనాథమఖాయ భూపా

యన్మో చితాస్తద నయ 9బలి మద్వరే తే||

శ్రీభాగ. 1 స్కం. 15 అ.9 శ్లో .

అర్జునుఁడు విలపించుచు నిట్లనెను :- పదివేల యేనుఁగుల బలముగలిగి, సమస్త రాజసమూహముచేఁ బూజింపఁబడు పాదములు కలిగిన జరాసంధుని నీతమ్ముఁడు భీమసేనుఁడు ఎవని ప్రభావముచే వధించెనో, జరాసంధుఁడు చేయఁదలఁచిన భైరవ యజ్ఞమందు బలియిచ్చుటకు బంధింపఁబడిన భూపతుఁనుఎవఁడు బంధవిముక్తి కావించెనో, అట్టి వారందఱు నీయజ్ఞ ములో వివిధోపహారములు కొనివచ్చి సమర్పించిరి. ఇదంతయు శ్రీకృష్ణ కృపవలననే సుమా ! అట్టి శ్రీకృష్ణుఁడు మనలను వదలి వైకుంఠమునకుఁ బోయినాఁడు.

ఛప్పయ

రాజసూయ కేసమయ సభీ భూపతి వశ ఆయే|

జరాసంధ నహిఁనమ్యో ఆప అతిశయ ఘబరాయే||

మగధేశ్వర కేదమన కరన కీయుక్తి బతాఈ |

అభయ కరత వాసమయ శ్యామ సబకహేఁ సుఝూఈ ||

రాజ 9!అర్జున భీమ మైఁ, తీనోఁ గిరివ్రజ జాయంగే |

జరాసంధ కూఁయుక్తితేఁ, మారి మగధ తేఁ ఆయంగే||

అర్థము

రాజసూయ యాగ సమయమున భూపతులందఱును వశ##మైరి. జరాసంధుఁడు మాత్రము వశపడలేదు. అప్పుడు మీరు చాల భయపడితిరి. అంత శ్రీకృష్ణుఁడు అభయదాన మొసఁగి మగధేశ్వరుఁడగు జరాసంధుని నిర్జించు నుపాయము నిట్లు జెప్పెను -

"రాజా ! అర్జునుఁడు, భీముఁడు, నేను ముగ్గురమును కలిసి గిరివ్రజమునకు వెడలెదము. అచ్చట జరాసంధునియుక్తితోఁ జంపి మగధనుండి మరలివచ్చెదము."

----

శోకవ్యాకులుఁడగుట వలనను, దుఃఖము పొంగి పొరలి వచ్చుటచేతను, వాక్కు గద్గదిక మగుటచేతను అర్జునుఁడిఁక ముందుసంగతి చెప్పలేకపోవుటను గాంచి ధర్మరాజిట్లనెను :- " సోదరా ! అర్జునా ! నీవు ఊరకుంటి వేమిరా ? ఇప్పుడు మన మేమి చేయవలయును ? మనకు కేవలము కృష్ణ కథయే ఆధారము. 'సంసారి యగువాఁడు నూఱుకార్యములను వదలిపెట్టియైన భోజనము చేయవలెను. ఆవశ్యకములగు వేయికార్యములు వదలియైన స్నానముచేయవలెను. లక్ష కార్యములను వదలియైన దానమును జేయవలయును. సమస్త కార్యములను వీడి, సాంసారిక కార్యములలోని లాభనష్టములను జూడక హరిస్మరణములోను, శ్రీకృష్ణచర్చలోను మునిఁగిపోవలెనని శాస్త్రవాక్యము.' మన ఆఁకలిదప్పులన్నియు శ్రీకృష్ణునితోడనే వెళ్ళిపోయినవి. ఇప్పుడేదో విధముగ రాత్రి గడచినచో మనము ముందు కర్తవ్యమును నిర్ణయించుకొనవచ్చును. ఈ ధరాధామమును వదలి శ్రీకృష్ణుఁడెట్లు స్వధామమును జేరెనో అట్లే మన నిద్రకూడ కన్నులను వదలిపోయినది. శ్రీకృష్ణకథాశ్రవణమున కాకులత చెందుచున్న యీ కర్ణములో ఇంద్రియములలో శ్రేష్ఠములైనవి. కావున నీవు శ్రీకృష్ణకృపను గూర్చిన కథను జెప్పి సుందర సంస్మరణము కలుగు నట్లు చేయుము."

ధర్మరాజు వాక్యములను విని గాండీవ ధనుర్థారియు కుంతీనందనుఁడగు నర్జునుఁడు కన్నుల నీరు తుడుచుకొని యిట్ల నెను :- " రాజా ! సుందర సంస్మరణము కావించుమందువేమి ? ఆతనిసంస్మరణము సుందరములలో సుందరమైనది. అసుందరతా వాసనయే అందులో లేదు. కలకండకు నాలుక నెక్కడ తాఁకించి నప్పుటికిని సర్వత్ర సమానముగ తీపియెట్లుండునో అట్లే శ్రీకృష్ణుని సమస్త చేష్టలలో, సమస్త లీలలో, సమస్త కథలలో నొకే రకమగు సుందరత కలదు. లోకములోని సుందరత్వము లన్నియు శ్యామసుందరుని నుండియే యుత్పన్నము లైనవి. కావుననే ఆతని సంబంధములో నెట్లు చెప్పినను, సంబద్ధములు, అసంబద్ధములు లెన్ని చెప్పఁబడినను అన్నియు సుఖకరములు, శాంతిప్రదములు, మనోహరములు, హృదయమును హరించునవిగ నుండును. గొప్ప యాశ్చర్య విషయ మేమనఁగా, మాయామోహరహితుఁéడై అఖిల భువనపతియగు శ్రీకృష్ణుడు, ఒక కుటుంబములోని వృద్ధుఁడు తన కొడుకులు మనుమలు మొదలగువారి యెడల నెట్టి మమత్వముతో నుండునో అట్లే మనల నిరంతరము మమమకారముతోఁ గాపాడినాఁడు ఏకాంత మందుఁగూడ మన హితమునే కోరుచుండును. ఆతని కెల్లప్పుడు రెండే కోరికలు కలవు. పాండవులకు మేలెట్లు కలుగునా యనునదొకటి, ధర్మరాజు సర్వప్రపంచములో సర్వశ్రేష్ఠుఁడు యశస్వి యగు చక్రవర్తి యగునా యనునది రెండవది.

మిమ్ములను బ్రసన్నులఁజేయుట కాతఁ డెంతగా తహ తహలాడినది మీకు తెలియును ప్రతిదినము మీరు చూచు చున్న విషయమే. మీరు సర్వశ్రేష్ఠమగు రాజసూయ యజ్ఞమును చేయుదు ననఁగానే ఆతఁడేంతగా సంతసించెనో మీకు తెలిసినదే. అత్యంతాహ్లాదముతో నాతఁడిట్లనెను :- "రాజా ! రాజసూయ యాగము భూమిలో సర్వశ్రేష్ఠుఁడగు చక్రవర్తియే చేయవలెనని నీవింతగా పరితాపపడెదవేల ? నీకంటె శ్రేష్ఠుఁడగు రాజింకెవఁడుఁగలడు? నేను నీకు సేవకుఁడనై యుండఁగా నీకు కొదువేల?

నీకు మనస్సులో జరాసంధుని భయమున్నది. ఆతఁడు పరమ పరాక్రముఁడగు నసురుఁడు. రాజుయై భూమిమీఁదఁ బుట్టెను. రాజులందఱు వానిపేరు చెప్పిన అడలిపోవుదురు. ఆతఁడు మూర్ఖతావశమున శ్రీకృష్ణునిపైఁగూడ దండెత్తెను. అదియు నొక్కసారికాదు, పదునెనిమిదిసారులు. వాని గర్వము వృద్ధి చెందుటకై శ్రీకృష్ణుఁడు బంధు పరివారసమేతముగా ద్వారకా నగరమునకు వచ్చినాఁడు. ఈ మూలమున వాని గర్వము శ్రుతి మించిపోయెను. ప్రపంచములో తననుమించిన వీరుఁడు లేఁడను కొనెను. వేలకొలఁది రాజులను భూతనాథునకు యజ్ఞములో బలియివ్వవలెనని వారి నందఱను బంధించెను. ఇంతటి బలవంతుఁడుండఁగా రాజసూయ యజ్ఞ మెట్లు నెఱవేరునా యని మీకు భయముండెను. మీభయమును అంతర్యామియగు భగవంతుఁడు గ్రహించెను. అప్పుడాతఁడు మిమ్ముల నోదార్చుచు మేఘగంభీరస్వరముతో గర్జించుచు నిట్లనెను :- " రాజా ! నీవే మాత్రము చింతింపవలదు. నేను నీశత్రువగు జరాసంధుని జంపించెదను. శల్య శస్త్రజ్ఞాత శరీరములో గ్రుచ్చుకొనిన అలుగును. బయటకు తీసిపారవేసినట్లు నీ హృదయకంటకుఁడగు రాజును ఈలోకములో లేకుండఁజేసెదను. నాకు భీమార్జునుల నిమ్ము ".

ఆతని భక్తవత్సలతను గాంచి నీవా సమయమున నెంతో విలపించితివి. నీప్రేమాశ్రువులచే నాతని పీతాంబరము దడిపి వేసితివి. మా యిద్దర నాతనికి నప్పగింతివి. దారిలో నాతఁడెట్టి వినోదము లొనర్చెనో చెప్ప వీలులేదు. మొదట నాతో నిట్లనెను :- " ఆర్జునా! జరాసంధుఁడు మహాబలవంతుడు.వాని నెట్లు జయింపగలుగుదుము ? నీవే యైదైన నుపాయమును జెప్పుము. నీవు వానితోఁబోరాడగలవా ?"

నేనిట్లంటిని :- " మీ యాజ్ఞయైనచో వానితోఁ బోరాడెదను. వానిని యుద్ధములో మూర్ఛపడఁగొట్టెదను. లేకపోతే ఆతఁడే నన్ను ఁజంపఁగలడు."

అంత నాతఁడు బాలకునివలె భయపడుచు నిట్లనెను :- " కాదయ్యా ! నీకేదైన అనిష్టము జరిగెనా ధర్మరాజుదగ్గఱకు నేనేమి ముఖము పెట్టుకొని పోవుదును ? అతఁడు చాల బలవంతుడు. నేను వానికి భయపడి సముద్రమధ్యములో నివసించుచున్నాను. వానిని ఁబరాక్రమముద్వారా యెవరు నోడింపలేరు ".

అంత నేనిట్లంటిని :- " అట్లే యగునెడల, తిరిగి పోవు దము. అట్టియెడ వానిదగ్గఱకు పోవుటెందులకు ?"

అంత నాతఁడు అన్యమనస్కుఁడై యిట్లనెను :- " తిరిగి యెట్లు పోవుదము? ధర్మరాజు రాజసూయ యజ్ఞము నెఱవేరదు కదా ! ఆతని ఆశ నీటఁగలిసిపోవును. ఆతఁడు దుఃఖించును. ధర్మరాజు చింతించినను, దుఃఖించినను నాజీవనమంతయు వ్యర్థమే. నాసమస్త కార్యములు ధర్మరాజు సంతోషముకొఱకే."

నేనిట్లంటిని :- " మీరు నరలీల చేయుచున్నారు.నన్ను యుద్దము చేయనీయక పోయితిరి. ఆతని బలమును గుఱించి భూరిభూరి ప్రశంసలు చేయుచుంటిరి. మీకంటె ఁగూడ ఆతఁడు బలవంతుఁడనుచుంటివి. తిరిగి వెళ్లుదమన, తిరిగివెళ్ళనీయరు. ధర్మరాజు యజ్ఞమును బూర్తి చేయవలె ననుచుందురు. మీరేమి చేయఁదలఁచినారో నా కేమియుఁదోఁచుటలేదు.''

అంత నాతఁడిట్లనెను:- ''ఆతని నోడింపక రాజసూయ యజ్ఞమును నెఱవేరదు. భీమసేనుఁడాతని జంపఁగలఁడు కాని ఆతనివద్ద అస్త్రశస్త్ర కౌశలము భీముని దగ్గఱకంటె నెక్కుడగ నున్నది.'' అంత భీమసేనునితో నిట్లనెను:- ''భీమాసేనా! ఇవ్వేళ నీకు పరీక్ష. ఇవ్వేళ నీవు జరాసంధుని చంపలేకున్నచో నిన్నందఱును దిండిపోతందురు. ఈతఁడు దినును, పోరాడఁబోయినపుడు పిల్లియగునని యెగతాళి చేయుదురు. నీ దగ్గఱ మే మిద్దఱము పిల్లలము. మనలోఁ బెద్దవాడఁవు నీవే. నీవే ఆతనితోఁ బోరాడవలయును.''

భీమసేనుఁ డభిమానముతో నిట్లనెను:- ''మంచిది. మీ రిద్దరు మెదలకుఁడు, నేనే వాని పని పట్టెదను; వాఁడెట్టి వాఁడో?'' ఇది వినఁగానే ఆతఁడు కిలకిలనవ్వెను. ఆతని నవ్వులో నెంతో మాధుర్యము కలదు. ఏదైన వినోదమున కాతభడు బిగ్గఱతనవ్వెనా దిశలు ప్రతిధ్వనులిచ్చునట్లు నవ్వును. నోటినుండి ముత్యాలు రాలుచున్నట్లుండును. నవ్వి నవ్వి కడుపుబ్బునట్లు నవ్వును. నేలమీఁద పొరలాడును. ఆతని అట్టహాసమున కందఱు నవ్వుదురు ఇట్లు భీముని జూచి చాలసేపటివఱకు నవ్వి యిట్లనెను:- 'బావా! మేమిద్దరము దూరముగ నుండి మీ యుద్ధమును జూచుచుండెదము. వాని బల మెక్కువయ్యెనా మేము కాలిక బుద్ధి చెప్పి పారపోయి వచ్చెదము. ఆ పరమ పరాక్రము నెదుర్కొనుటకు మాలో నెవరికిని సామర్థ్యములేదు.'

అంత భీమన్నగారు కృష్ణుని ఎగతాళిచేయుచు నిట్లనెను:- ''నీవు పారిపోవుట నేర్చుకొన్నావు. ఎప్పుడు యుద్ధమనునది యెఱుఁగవు. ప్రపంచమంతలోఁ బిరికిపందవు. వానిని నేను రెండుగఁ జీల్చి పారవైచెదను. నేననిన నేమనుకొనుచున్నావు?'' ఇది వినఁగానే యాతఁడత్యానందము చెందెను. అంత నాతఁడు భీమసేనుని గౌఁగిలించుకొని యిట్లనెను:- ''బలవంతుఁడవగు నోభీమసేనా! నీవు తప్పక వానిని జంపఁగలవు. నీ బలాధార మును జూచుకొనియే మేము బయలదేరివచ్చితిమి.''

రాజా! ఆతని కెవని బలాధారము కావలయును? చేయువాఁడు, చేయించువాఁడు నతఁడే. ఏకార్యములోనైనను ఎవనినో ఒకనిని నిమిత్తముగఁ జేయును. భీమసేనుని నిమిత్తము కావించి పదివేల యేనుఁగుల బలముగల దైత్యాంశుఁడగు రాజును నిమిషములోఁ జంపించెను. అంత కారాగృహములో నున్న వేలకొలఁది రాజులను విడిపించెను.

చిరకాలము కారావాసములో ననేకయాతనల పడి దుర్బలులై, తమ జీవితాశను వదలుకొనిన రాజులందఱకును జీవనప్రదానము కావించి వారందరకు స్వాగతసత్కారములు కావించెను. విచిత్రవాహనములమీఁద వారినిఁదమదేవములకుఁ బంపునపుడు వారికిట్లు చెప్పెను:- ''మీరందఱు ధర్మరాజ రాజసూయయాగమునకు ఉత్తమోత్తమములగు నుపహారములను గొని రావలయును.'' అందు నొకానొకనితో నిట్లనెను:- ''మీవద్ద బంగారు గనియున్నది. మంచి బంగారమును దేవలయునుసుమా!'' ఇంకొకనితో నిట్లనెను:- ''నీవు పదివేలు యేనుఁగులను, ఇరువది వేలు మంచి గుఱ్ఱములను దేవలయును'' వేఱొకనితో నిట్లనెను:- ''నీవద్ద కంబళములు, మృగచర్మములు, పులిచర్మము లధికముగ నుండును. వాటిని నీవు వేలకొలది వాహనములందు వేసికొని అన్నిటికంటె మంచివి తేవలయును?'' రాజా! ద్రవ్యలోభియగు రాజు తనప్రజలపై పన్నులను వేసి వసూలు చేసినట్లు ఆతఁడప్పు డారాజులందఱ ననేక విధముల నాజ్ఞాపించెను. ఆరాజులందఱు ననేక విధములు మీరు చేసిన యజ్ఞమునకు వచ్చి సమర్పించిరి అందఱు వారి కిరీటమణులచే మీ పాదపద్మములను చమత్కృతిగ శోభింపఁజేసిరి. రాజా! అట్లి శ్యామసుందరుఁడు నేఁడు మనల ననాథలఁ గావించి వదలి స్వధామమునకుఁ బోయినాఁడు కదా! ఈ వసుంధరాదేవి విధవయైనది. ఈలోకమంతయు నాకు శూన్యముగఁ దోఁచుచున్నది. ఏమి చేయుదును? ఎక్కడికి వెళ్లుదును? నాప్రియతముని నేనెక్కడ పొందగలను?'' అనుచు నర్జునుఁడు మరల వస్త్రమును ముఖమునకుఁగప్పుకొని వెక్కి వెక్కి యేడ్చుచుండెను?

ఛప్పయ

ఆజ్ఞా లేకేఁ చలే సాథ్‌ హమదోనోఁ లీన్హేఁ ||

క్షత్రీ బానో బదలి వేష విప్రని కేకీన్హేఁ ||

జ్యేష్ఠబంధు తేఁ భిడా దుష్ట మరవాయో ఇవతేఁ ||

బందీ భూపతి ముక్త కరే బోలే హరి ఉనతేఁ ||

ధర్మరాజ కే యజ్ఞమేఁ, మహుత భేఁట్‌ లే ఆఉ నబ్‌ |

వేహీ హమరే హృదయ ధన, శ్యామ సిధారే ధామ అబ్‌ ||

అర్థము

అన్నా! ధర్మజా! మీయాజ్ఞను గొని భీముని, నన్ను వెంటఁ గొనిపోయెను. దారిలో క్షత్రియవేషములను మార్చుకొని బ్రాహ్మణ వేషములను ధరించుకొంటిమి. అన్నయగు భీమసేనుఁడు జారాసంధునితోఁ బోరాడి ఆదుష్టుని సంహరించెను. కారాగృహములోనున్న రాజులను విడిపించి వారితో నిట్లనెను:- 'మీరందఱు ధర్మరాజు రాజసూయ యజ్ఞమునకు కానుకలు తీసుకొని రావలెను.' అట్టి మన హృదయ ధనమగు శ్యామసుందరుఁ డిప్పుడు స్వధామమునకు వెడలెను గదా!'

BHAGAVATA KADHA-3    Chapters